సంపాదన లేకపోయినా భార్యకు భరణం చెల్లించాల్సిన బాధ్యత భర్తకు ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం లేకపోయినా రోజుకు రూ. 300-400 సంపాదించే అవకాశం ఉన్నందున భరణం కింద నెలకు రూ.2 వేలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్దించింది. ఓ విడాకుల కేసులో ఈ మేరకు కుటుంబ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ లక్నో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
భార్యకు మంజూరైన భరణం మొత్తాన్ని భర్త నుంచి రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిని జస్టిస్ రేణూ అగర్వాల్ ఆదేశించారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన జంట 2015లో వివాహం చేసుకుంది. వరకట్న వేధింపుల ఆరోపణలు చేస్తూ తన భర్త, అత్తమామలపై భార్య 2016లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. దీంతో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం వేరుగా ఉంటున్న తన భార్యకు ప్రతి నెల రూ.2 వేలు భరణం అందించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు భర్త 2023 ఫిబ్రవరి 21న హైకోర్టులో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. గ్రాడ్యుయేట్ అయిన తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందని, ఈ విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పట్టించుకోలేదని హైకోర్టులో వాదించాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆరోగ్యం బాగా లేకున్నా కూలీగా పని చేస్తూ.. అద్దె గదిలో నివసిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు, తనపై తల్లిదండ్రులు, సోదరిలను పోషించాల్సిన బాధ్యతలు ఉన్నాయని కోర్టుకు తెలియజేశాడు.
అతడి వాదనలను జస్టిస్ రేణు అగర్వాల్ తిరస్కరించారు. 2022లో అంజు గార్గ్ కేసులో ఉద్యోగం లేదా వ్యాన్ నడుపుతూ ఆదాయం పొందుతున్నాడని కోర్టు భావించినట్లయితే తన భార్యకు భరణం అందించే బాధ్యత ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది.