ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడే యాక్టివ్ అయ్యారు.. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు పట్టుబడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాల్లో భారీగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కారులో నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సింగరాయకొండ సీఐ, జరుగుమల్లి ఎస్సైతమ సిబ్బందితో కలిసి టంగుటూరు 16వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో చెన్నై నుంచి గుంటూరుకు వెళ్తున్న కారును ఆపి సోదాలు చేశారు.
కారులో ఓ బ్యాగు కనిపించగా ఓపెన్ చేసి చూశారు.. అందులో ఏకంగా రూ.కోటి కరన్సీ కట్టలు ఉన్నాయి. అందులో ఉన్న రామస్వామి ప్రతాప్, సాకత్ అలీ ఫరూక్ అబ్దుల్లా, మనీ పరమశివలను డబ్బుల గురించి ప్రశ్నించారు. వారు డబ్బులకు సంబంధించి సరైన ఆధారాలు చూపలేకపోయారు. దీంతో డబ్బులు, కారు, ముగ్గురు వ్యక్తులను టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరు చెన్నైకి చెందిన ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఆ సంస్థ నిర్వాహకులు గతంలో తమిళ సినిమాలు తీసినట్లు చెప్పారు. గుంటూరుకు చెందిన వారికి నగదు ఇచ్చి రావాలని యజమాని సూచించడంతో తాము తీసుకెళ్తున్నట్లు పోలీసులకు వివరించారు. సరైన పత్రాలు చూపకపోవడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగదు సీజ్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన నగదును విజయవాడ ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.