ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు మీదున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీని, తన సోదరుడైన సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని ఆమె మాటల తూటాలు పేలుస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్న షర్మిల.. ఆ పార్టీ పేరులో వైఎస్ఆర్ అనే పదానికి కొత్త అర్థం ఇదంటూ.. ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. జగన్ లక్ష్యంగా ఆమె చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి.
ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించిందని తెలుస్తోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం షర్మిలకు 4+4 సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక.. జగన్ సర్కారు ఆమె భద్రతను 1+1కు తగ్గించిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. షర్మిల రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రజలతో మమేకం అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె పర్యటనలు అక్కడక్కడా ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలకు భద్రతను తగ్గించడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలకు వెంటనే 4+4 సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ నేతలు కూడా షర్మిల భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఆమెకు ప్రాణ హాని ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించడం గమనార్హం. షర్మిలకు భద్రత పెంచాలని అయ్యన్నపాత్రుడు కేంద్రాన్ని కోరారు.
2014లో భద్రత కుదించిన టీడీపీ ప్రభుత్వం..
సరిగ్గా పదేళ్ల క్రితం.. 2014 సెప్టెంబర్లో టీడీపీ ప్రభుత్వం వైఎస్ విజయమ్మతోపాటు షర్మిల దంపతులకు భద్రతను తగ్గించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారణాలతోనే తమ భద్రతను తగ్గించారని విజయమ్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలినని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. తనకు ముప్పు ఉందంటూ.. అంతకు ముందే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీకి విజయమ్మ మెమోరాండం సమర్పించారు. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విజయమ్మతోపాటు షర్మిలకు భద్రతను పునరుద్ధరించాలని టీడీపీ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దిగొచ్చిన బాబు సర్కారు విజయమ్మకు, షర్మిలకు భద్రతను పునరుద్ధరించింది.
2014లో షర్మిల వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆమె రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇప్పుడు అదే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉండగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమెకు తెలంగాణ సర్కారు కల్పించినట్టుగా 4+4 భద్రత కాకుండా 1+1 సెక్యూరిటీని కల్పించడం గమనార్హం. అప్పుడు షర్మిలకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల నుంచి పూర్తి మద్దతు ఉండగా.. టీడీపీ కేడర్ వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెెస్ సంగతి చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే షర్మిలకు కాంగ్రెస్, టీడీపీ నేతలు మద్దతుగా మాట్లాడుతుండగా.. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ భద్రతను కుదించింది. విధి వైచిత్రం అంటే ఇదేనేమో..!