దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. గురువారం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. వరప్రసాద్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారనే నెపంతో వరప్రసాద్‌ను కులం పేరుతో దూషించి, రాజకీయ నాయకుల అండదండలతో పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేయించారని జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. నిందితులకు చట్టం ప్రకారం శిక్ష విధించాలని కోర్టును న్యాయవాది కోరారు. విచారణ పూర్తి కాకుండా నిందితులు వేసిన క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేవని సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలని శ్రవణ్ కుమార్ కోరారు. శ్రవణ్ కుమార్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్ట్.. నిందితులందరి క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ తీర్పు వెల్లడించింది. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత విచారణ కొనసాగించవలసిందిగా పోలీసులకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.