ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోటీల్లో లక్షలు గెలుచుకున్న ఎద్దులు.. 10 ఎకరాలు కొన్న నంద్యాల రైతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 09:43 PM

పశువులను సైతం కుటుంబసభ్యుల్లా చూసుకునే సంస్కృతి మనది. పాడి పశువులకు ఏదైనా జరిగితే.. కుటుంబసభ్యుడికి అపాయం జరిగినట్లే తల్లడిల్లిపోతారు వాటిని అపురూపంగా చూసుకునే రైతులు. పశువులకు, వారికి ఒక రకమైన కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. యజమాని బాధను అవి, వాటి బాధను యజమాని ఇట్టే అర్థం చేసుకుంటారు. అనాదిగా భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఒంగోలు జాతి ఎద్దులను సొంతబిడ్డల్లా చూసుకుంటున్నారు నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు. ఆ వృషభాలు కూడా ఆయనపై అంతే మొత్తంలో ప్రేమను, కనకవర్షాన్ని కురిపిస్తున్నాయి. 6 నెలల వ్యవధిలో 39 లక్షల రూపాయలు సంపాదించి పెట్టాయి. నంద్యాల జిల్లాకు చెందిన రైతు బోరెడ్డి కేశవరెడ్డి గురించి, ఆయన పెంచుకుంటున్న ఎద్దుల గురించి తెలుసుకోవాల్సిందే.


నంద్యాల జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన సన్న కారు రైతు బోరెడ్డి కేశవరెడ్డి తనకు వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తండ్రి, తాతల మాదిరిగానే ఎద్దులను పెంచుకుంటూ, వాటితో పోటీల్లో పాల్గొంటున్నారు. ఒంగోలు జాతి ఎద్దులను కొని పెంచుకుంటున్నారు కేశవరెడ్డి. వాటికి సరైన ఆహారం అందిస్తూ.. వ్యవసాయ పనులను పూర్తి చేసుకోవడంతో పాటు బండలాగుడు పోటీల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన వందలాది ఎద్దుల పోటీల్లో పాల్గొని, బహుమతులను గెలుచుకున్నారు. అలా గెలుచుకున్న మొత్తంలో కొన్నేళ్ల కిందట 10 ఎకరాల పొలం కొన్నారు కేశవరెడ్డి.


బోరెడ్డి కేశవరెడ్డి 2022 డిసెంబర్‌లో తన వద్ద ఉన్న జంట ఎద్దులను రూ. 48 లక్షలకు అమ్మేశారు. ఆ తర్వాత రూ. 54 లక్షలతో మేలుజాతి ఒంగోలు గిత్తలను కొనుగోలు చేశారు. వాటికి బలవర్థకమైన ఆహారం అందిస్తూ, పోటీ నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించారు. దీంతో ఆ గిత్తలు దిట్టంగా తయారయ్యాయి. వాటికి వీరనరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని పేర్లు కూడా పెట్టారు. ఇప్పుడీ ఈ ఎద్దులు ఆయనకు కనకవర్షం కురిపిస్తున్నాయి. గడిచిన ఆరు నెలల్లో 66 పోటీల్లో ఈ వృషభాలు పాల్గొనగా.. 64 సార్లు విజేతలుగా నిలవడం విశేషం. మిగిలిన ఆ రెండు పర్యాయాలు కూడా రన్నరప్‌గా నిలిచాయి. అంటే, పాల్గొన్న ప్రతి పోటీలో బహుమతి ఖాయం అన్నమాట. ఇప్పటివరకూ అలా రూ. 39 లక్షల నగదు బహుమతులను, రెండు బైకులను, మూడు నంది అవార్డులను గెలుచుకున్నాయి. పదుల సంఖ్యలో ట్రోఫీలు, షీల్డ్స్ గెలుచుకున్నాయి.


ఎద్దుల పోషణకు ఎంత ఖర్చవుతోంది?


ఈ ఎద్దుల పోషణ కోసం నెలకు 30 వేల రూపాయల వరకు ఖర్చు అవుతోందని కేశవరెడ్డి తెలిపారు. ఈ గిత్తలకు తోడుగా ఓ పొట్టేలు కూడా ఉంది. వీటిని పోటీలకు తరలించేందుకు ప్రత్యేకంగా ఓ డీసీఎంను కూడా కొన్నారు. కేశవరెడ్డి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్వగ్రామంలోనే నివసిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన రెండెకరాలతో పాటు తన కష్టార్జితంతో సంపాదించిన 10 ఎకరాలు కలిపి.. మొత్తం 12 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీలు జరిగినా సరే.. తాము సిద్ధం అంటూ రంకెలేస్తున్నాయి నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. ఆ అన్నదాతకు, వృషభాలకు హ్యాట్సాఫ్..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com