జైపూర్: రాజస్థాన్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 22 మంది కాంగ్రెస్, ఒక ఆర్ఎల్డీ శాసన సభ్యుడు సహా మొత్తం 23 మంది ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 13 మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా... మిగతా 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు. రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణం చేశారు.
మంత్రులుగా ప్రమాణం చేసిన ప్రముఖుల్లో బులాకీ దాస్ కల్లా, శాంతి కుమార్ ధరివాల్, ప్రసాదీలాల్ మీనా తదితరులు ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఈ నెల 17న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొత్త మంత్రుల ఎంపిక కోసం ఢిల్లీ వెళ్లిన వీరిద్దరూ.. మూడు రోజుల పాటు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. విస్తృత సంప్రదింపుల అనంతరం తుదిజాబితాతో ఆదివారం జైపూర్‌కు తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి సహా రాజస్థాన్ కేబినెట్‌లో మొత్తం 30 మంది మంత్రులకు అవకాశం ఉంది. అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నందున మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది.