కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దారెటు అనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ను కాదని, మైలవరం వైసీపీ ఇంఛార్జిగా తిరుపతి యాదవ్‌ను వైఎస్ జగన్ నియమించారు. అయితే అంతకుముందు నుంచే అధిష్టానం తీరుపట్ల వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ కారణంగానే ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం సభకు కూడా హాజరుకాలేదు. అలాగే అనుచరులను సైతం సిద్ధం సభకు వెళ్లకుండా చూశారని టాక్.
అయితే ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్‌కు ఓ షాక్ ఇచ్చిన వైసీపీ.. తాజాగా మరో షాక్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. వసంత కృష్ణప్రసాద్ అనుచరులకు ఝలక్ ఇచ్చింది. మైలవరం పరిధిలో 28 మంది కో ఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు, సభ్యులను ప్రభుత్వం తప్పించింది. వసంత కృష్ణప్రసాద్ వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందనే నివేదికలతో వైసీపీ ఈ పని చేసినట్లు సమాచారం. మరోవైపు వైసీపీ నుంచి టికెట్ దక్కే అవకాశాలు కనిపించకపోవటంతో వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాలను వసంత కృష్ణప్రసాద్ పరిశీలిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు జరిపి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు.
ఇంకోవైపు వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళతారనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నేతలతో సమాలోచనలు కూడా జరిపినట్లు తెలిసింది. అయితే మైలవరం టీడీపీ ఇంఛార్జి దేవినేని ఉమామహేశ్వరరావు.. వసంత కృష్ణప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్.. దేవినేని ఉమా మీద విజయం సాధించారు. అలాగే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా టీడీపీలో పనిచేసిన వారే. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూనే దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నపార్టీలోకి మారటం వారికి అలవాటేనంటూ దేవినేని మండిపడుతున్నారు. 2019లో తనను ఓడించేందుకు వసంతకృష్ణ ప్రసాద్ కుట్రలు చేశారని, నందిగామ, మైలవరాన్ని తాకట్టు పెట్టి దొంగ దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రూ.100 కోట్లతో కొందరిని కొనుగోలు చేసి టీడీపీలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారంటూ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వసంత కృష్ణప్రసాద్, వసంత నాగేశ్వరరావు టీడీపీలో చేరటాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించనని స్పష్టం చేశారు. పాతికేళ్లుగా టీడీపీ పార్టీ నిర్ణయాలను గౌరవించానన్న దేవినేని ఉమా.. ఫిబ్రవరి రెండో వారంలో అన్నేరావుపేట నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని అన్నారు.
వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమా వ్యాఖ్యలతో ఇప్పుడు మైలవరం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారింది. ఉమా వ్యతిరేకిస్తున్నా కూడా వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారా, చంద్రబాబు అందుకు అంగీకరిస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వసంత కృష్ణప్రసాద్‌తో నందిగామ జనసేన ఇంఛార్జి రమాదేవీ భేటీ కావటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో చేరే అవకాశం లేకపోతే.. వసంత కృష్ణప్రసాద్ దారి జనసేనవైపు మళ్లుతుందేమో చూడాలి మరి. సోమవారం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో అప్పటికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.