ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెరలేపిందని.. అందుకే వైఎస్సార్‌సీపీకి విధేయులైన అధికారులను కీలక స్థానాల్లో నియమిస్తోందని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఇటీవల 104 మంది డీఎస్పీల బదిలీలు జరగ్గా, 42 మందిని ఎస్‌డీపీవోలుగా నియమించారు. వారిలో 10 మంది జగన్ సామాజికవర్గం వారేనని పేర్కొన్నారు. వారందరినీ బదిలీ చేసి నిష్పాక్షికంగా పనిచేసే అధికారులను నియమించాలని కోరారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. తిరుపతి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే లక్ష్మీశ స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇంటికి వెళ్లి కలవడంతో పాటు ఆయన్ను శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు గుర్తుచేశారు. లక్ష్మీశ నేతృత్వంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయని తాము నమ్మడం లేదని, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని కోరారు.
తిరుపతి నుంచి పి.పరమేశ్వర్‌రెడ్డిని ప్రకాశం ఎస్పీగా బదిలీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మేలు చేసేందుకే పరమేశ్వర్‌రెడ్డిని ప్రకాశానికి బదిలీ చేశారని ఆరోపించారు. తిరుపతి ఎస్పీగా ఆయన వైఎస్సార్‌సీపీ అక్రమాలకు అండగా నిలవడంతో పాటు విపక్షాల కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. బోగస్ ఓట్లపై ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే ఎస్‌డీపీవోలుగా జగన్ తన సామాజికవర్గం వారినే అధికంగా నియమించారని లేఖలో పేర్కొన్నారు.