అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర సన్నివేశాలు, ఎన్నడూ చూడని ఘటనలు చోటు చేసుకోవడం పరిపాటి. రాజకీయంగా శత్రువులుగా ఉన్న కొందరు నేతలు అసెంబ్లీ సమావేశాల సమయంలో చమత్కరించుకుంటూ మాట్లాడుకున్న సన్నివేశాలు చూశాం. పలు ఆసక్తికర చర్చలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఏపీ అసెంబ్లీలోనూ అలాంటి ఘటనే జరిగింది. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘‘మీరూ.. నేనూ రిటైర్ కాబోతున్నాము’’ అంటూ బుచ్చయ్య చౌదరిని పేర్నినాని పలకరించారు. అందుకు తానేమీ రిటైర్ కావడం లేదని బుచ్చయ్య సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్యకు టిక్కెట్ ఉండదంటున్నారని పేర్ని నాని అనగా.. 2024 సభలో తాను కచ్చితంగా ఉంటానని బుచ్చయ్య స్పష్టం చేశారు. ‘‘ప్రాంతీయ పార్టీల్లో టిక్కెట్ ఇవ్వాలా..? వద్దా..? అనేది పార్టీ అధినాయకత్వాల ఇష్టమే’’ అని పేర్ని నాని అనగా.. ‘‘నా విషయంలో మా అధిష్టానం అలా ఆలోచించదు’’ అని బుచ్చయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పేర్నినాని, బుచ్చయ్య చౌదరి మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది.