ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల రెడ్డి దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యతను తీసుకున్న షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వైఎస్సార్సీపీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి తొమ్మిది రోజుల పాటు జిల్లాల్లో షర్మిల పర్యటించి అందరిని కలుపుకుపోతూ.. కీలన నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి షర్మిల జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 7 నుంచి 11 వరకు షర్మిల జిల్లాల పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పలు నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు.
షర్మిల పర్యటన షెడ్యూల్
ఈ నెల 7న సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభ, ఈ నెల 8న ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ. 8న సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభ, ఈ నెల 9న ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ. 9న సాయంత్రం 5 గంటలకు తుని నియోజకవర్గంలో బహిరంగ సభ, ఈ నెల 10న ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలో రచ్చబండ. 10న సాయంత్రం 5 గంటలకు పాడేరు నియోజకవర్గంలో బహిరంగ సభ, ఈ నెల 11 న సాయంత్రం 5 గంటలకు నగరి నియోజకవర్గం బహిరంగ సభ.