కాంగ్రెస్ పార్టీ పానలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాధనాన్ని సొంత ఏటీఏంగా పరిగణిస్తుందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల జాబితా ఎప్పటికీ అంతం కాదని తెలిపారు. యూపీఏ దశాబ్ద పాలనలో రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. గతేడాది కంటే ఆరు శాతం అధికంగా రూ.47.65 లక్షల కోట్లు ఖర్చు చేయాలని మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిందని, రెవెన్యూ వసూళ్ళు రూ.30.8 లక్షల కోట్లుగా అంచనా వేయగా, గతేడాది కంటే వసూళ్ళు 12% ఎక్కువగా ఉందన్నారు. మొత్తంగా, ఇది దేశంలో అభివృద్ధి, వ్యయాలకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు.ద్రవ్య లోటును 5.8% నుండి 5.1%కి తగ్గించాలని ప్రభుత్వ యోచన బాగుందని ఇది ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చేందుకు తోడ్పడుతుందన్నారు. కొత్త పథకాల కోసం ఆర్థిక వ్యవహారాల శాఖకు మూలధన వ్యయంగా రూ.70,449 కోట్లు కేటాయించారని, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి సహాయపడుతుందన్నారు. గత రెండు దశాబ్దాల్లో పదేళ్లు కాంగ్రెస్‌వల్ల నష్టపోయామని, తదనంతర పదేళ్లలో దేశం వృద్ధి చెందిందన్నారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందనడానికి సాక్ష్యం గణాంకాలేనని అన్నారు.