తెలుగుదేశం వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీ-ఓటర్ సంస్ధ సర్వేకు విశ్వసనీయత లేదని, గతంలో ఆ సంస్ధ ఇచ్చిన సర్వే కూడా ఫెయిల్ అయిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయం వద్ద తనను కలసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇండియా టుడే సర్వే గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నపై మాట్లాడుతూ.. సీ ఓటర్ అనే సంస్ధ ఆ సర్వే చేసినట్లు ఉంది. ఆ సంస్ధ 2019లో కూడా 35 శాతం ఓట్లు మాకు 41...42 శాతం ఓట్లు టిడిపికి ఇచ్చినట్లుగా ఉంది. అలాగే 15 సీట్లు టిడిపికి 10 సీట్లు వైయస్ఆర్‌సీపీ కి ఇచ్చినట్లు గుర్తు. ఇంకొక అడుగు ముందుకు వేసి ఎగ్జిట్ పోల్ అని ఇచ్చిన దాంట్లో మాకు 11 , టిడిపికి 14 ఇచ్చినట్లు నాకు గుర్తు.అలాంటి సంస్ధ విశ్వసనీయత ఎంతో తెలిసిపోతుంది. ఫలితాలు చూస్తే మాకు 22, టిిడిపికి 3 వచ్చాయి. ఓటు శాతం దాదాపు 50 శాతం ఓట్లు వచ్చాయి. వారి క్రెడిబులిటి ఏంటనేది అర్దం అవుతుంది.కొన్ని సర్వేలు మీకు అనుకూలంగా ఉంటున్నాయని కూడా మీరనవచ్చు.అల్టిమేట్ గా చూస్తే జగన్ గారు ఎంత కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తున్నారు.చంద్రబాబు ఎంత నిరాశా,నిసృహతో ఉన్నారు తెలిసిపోతుంది. చంద్రబాబు అందర్ని కలుపుకుని ప్రజలముందుకు పొత్తులతో వెళ్లి ప్రజెంట్ చేసి మాయమాటలు చెప్పి నాలుగు ఓట్లు దండుకోవాలని చేస్తున్నారు.