మోదీ ప్రభుత్వం ఏపీకు తరతరాలుగా తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, కేవీపీ రామచంద్ర రావు అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. ఏపీకు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో హామీలు అమలు కావాలని శక్తికి మించి తాను పోరాడానని తెలిపారు. మోదీ అమరావతికి పవిత్ర జలాలకు బదులు కలుషిత జలాలు తీసుకొచ్చినట్లుందని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎవరూ ఏపీకి రాజధాని లేదని మోదీని ప్రశ్నించింది లేదని కేవీపీ రామచంద్ర రావు చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారని ధ్వజమెత్తారు. ఇసుక రవాణా, మద్యంలో వచ్చే ఆర్థిక వనరులు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు బీజేపీకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలల్లో మంత్రులు, పెద్ద స్థాయి నేతలు అరెస్టవుతారని.. కానీ ఈడీ, ఇన్ కం టాక్స్, మోదీ దృష్టిలో ఏపీ క్లీన్‌గా ఉందని అన్నారు. ఏపీలో మంత్రులు, అధికారులపై చర్యలకు మోదీ అంగీకరించరని దెప్పిపొడిచారు. మోదీ సహకారం లేకుండా ఏపీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేయగలదా..? అని కేవీపీ రామచంద్ర రావు ప్రశ్నించారు.