ఎట్టకేలకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి గురువారం ఎన్నికలు జరిగి.. ఫలితాలు వెలువడుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. అత్యధిక స్థానాల్లో పీటీఐతో సంబంధం ఉన్న ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇక, సైన్యం మద్దతు ఉందని భావిస్తోన్న మరో మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్-ఎన్ ప్రదర్శన పేలవంగా ఉంది. దీంతో కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి పాకిస్థాన్ సైన్యం వేసిన ప్లాన్ పూర్తిగా విఫలమైంది.
దాదాపు రెండేళ్ల కిందట అవిశ్వాస తీర్మానంతో పదవీచిత్యుడైన ఇమ్రాన్ ఖాన్.. పలు అవినీతి కేసులను ఎదుర్కొన్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపగా.. ఎన్నికలకు వారం రోజుల ముందే రెండు కేసుల్లో 20 ఏళ్లు శిక్షపడింది. ఇక, ప్రవాసం ముగించుకుని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జాతీయ ఎన్నికల సమయానికి తిరిగి పాకిస్థాన్‌కు వచ్చారు. ఇవన్నీ సైన్యం కనుసన్నల్లోనే జరిగాయనేది విశ్లేషకులు వాదన.
అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ లేదా ఆయన పార్టీ పీటీఐ ఎన్నికల్లో పోటీ, ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించి, రాజకీయ 'రంగం' నుంచి సమర్థవంతంగా తప్పించారు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం కూడా పీటీఐ సంప్రదాయ 'బ్యాట్' గుర్తును రద్దుచేయడంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రులగా పోటీ చేయవలసి వచ్చింది. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ సోషల్ మీడియా, కృత్రిమ మేధను ఉపయోగించి జైలు నుంచి ప్రచారం చేయడానికి ఇమ్రాన్ ప్రయత్నించారు. కానీ, ఆయన సమయంలో ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగించడంతో ప్రయత్నాలు తరచుగా విఫలమయ్యాయి.
ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీకి వ్యతిరేకంగా ‘పిచ్’ ‘అంపైర్’, ‘ఆడే పరిస్థితులను’ సైన్యం నియంత్రించే ప్రయత్నం చేసినా కానీ, ప్రజలు మాత్రం అనూహ్య తీర్పును ఇస్తున్నారు. పాక్ సైన్యం స్క్రిప్ట్‌ను ధిక్కరించారని ఫలితాల సరళి సూచిస్తోంది. ఈ పరిణామాలు ఉన్నప్పటికీ తదుపరి పాక్ ప్రధాని ఎంపికపై సైన్యం ప్రభావం చూపే అవకాశం ఉంది. స్వతంత్రులు విధేయతనపై అనిశ్చితి? వివిధ ఒత్తిళ్లు వారిపై పనిచేసే అవకాశం ఉంది.
శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతోన్న ఫలితాల సరళి పీటీఐ, పీఎంఎల్-ఎన్ మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని స్థానాల్లో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. ఫలితాల్లో జాప్యానికి ఇంటర్నెట్ సేవల్లో అంతరాయమే కారణమని పాక్ సీనియర్ ఎన్నికల అధికారి జాఫర్ ఇక్బాల్ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా గురువారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో ఓట్ల లెక్కింపు మరింత క్లిష్టంగా మారింది. మొత్తం 265 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగ్గా.. సాయంత్రం నుంచి లెక్కింపు కొనసాగుతోంది. పూర్తిస్థాయి ఫలితాలు శుక్రవారం రాత్రికి వచ్చే అవకాశం ఉంది.