విహార యాత్రకోసం మిత్రులతో కలసి వచ్చిన ఓ తమిళ యువకుడు గల్లంతయ్యాడు.పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం కుండ్రత్తూకు మండలంలోని కొవ్వూరుకు చెందిన శ్యామ్(20) చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం డిగ్రీ కళాశాలలో బీకాం మూడవ సంవత్సరం చదువుతున్నాడు. సెలవులివ్వడంతో తొమ్మిదిమంది స్నేహితులతో కలిసి గురువారం ద్విచక్ర వాహనాలపై విహార యాత్ర కోసం చిత్తూరు,నాగలాపురం మండలంలోని సద్దికూడు మడుగు చేరుకున్నాడు. సాయంత్రం వరకు అక్కడే ఉల్లాసంగా గడిపిన శ్యామ్ నీటిలోకి దిగాడు. మడుగులో నీటి ప్రవాహం ఉధ్రుతంగా ఉండడంతో గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు నాగలాపురం పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్‌ఐ ఓబయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అర్థరాత్రి వరకు యువకుడి ఆచూకీ కనిపించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.శుక్రవారం ఉదయమే సత్యవేడు అగ్నిమాపక సిబ్బందితో కలిసి పోలీసులు మడుగు వద్దకు చేరుకున్నారు. రోజంతా ప్రయత్నించినా శ్యామ్ మృతదేహం ఆచూకి లభ్యం కాలేదు. మడుగు ప్రాంతం విస్తీర్ణం తక్కువగా ఉండి చాలా లోతుగా ఉండడంతో మృతదేహాన్ని వెలికితీయడం కష్టంగా మారింది. చీకటి పడడంతో పోలీసులు, అగ్నిమాపకదళం వెనుదిరిగారు. శనివారం మరలా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. శ్యామ్ ఆచూకి లభ్యం కాకపోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. శ్యామ్ ఈ జలపాతానికి రావడం మూడోసారని అతని స్నేహితులు తెలిపారు.