యాడికి మండల కేంద్రంలోని చౌడేశ్వరి కాలనీలో కట్టుకున్న భార్య, కన్న కూతురును ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఒక రోజు తరువాత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యాడికి పట్టణానికి చెందిన చంద్రావతి(25)ని పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన రామకృష్ణకు ఇచ్చి 2018లో వివాహం చేశారు. వీరికి కూతుళ్లు శాన్విత (4), చైత్రిక (9 నెలలు) ఉన్నారు. రామకృష్ణ దంపతులు చేనేత మగ్గం ద్వారా జీవనం సాగిస్తున్నారు. యాడికి చౌడేశ్వరికాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. శాన్విత గురువారం బడికి వెళ్లింది. ఆ తరువాత భార్యను, చిన్న కూతురును రామకృష్ణ హత్య చేసి వెళ్లిపోయాడు. చంద్రావతి చేతులను కట్టేసి తలదిండుతో ఊపిరి ఆడకుండా చేశాడు. చైత్రిక గొంతు నులిమి, మీద బియ్యం ప్యాకెట్ పెట్టి వెళ్లిపోయాడు. తాము తాడిపత్రికి వైద్యం కోసం వెళుతున్నామని, బడికి వెళ్లిన శాన్వితను సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లాలని చంద్రావతి తండ్రి సెల్‌ఫోనకి గురువారం మధ్యాహ్నం మెసేజ్ పంపించాడు. ఆ తరువాత సెల్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన స్విచాఫ్ రావడంతో చంద్రావతి బంధువులు అనుమానించి, శుక్రవారం పోలీసులను సంప్రదించారు. వారి సూచన మేరకు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పుడుగానీ హత్యల గురించి బయట పడలేదు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, యాడికి సీఐ నాగార్జునరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు ఆరాతీశారు. చంద్రావతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ ఆనలైన జూదం ఆడేవాడని, అనాథల అంత్యక్రియలు నిర్వహించేవాడని స్థానికులు అంటున్నారు. అందరితోనూ మంచిగానే ఉండేవాడని, హత్యలకు కారణం తెలియదని అంటున్నారు.