హీరో మోటోకార్ప్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 50 శాతం వృద్ధి చెంది రూ.1,093 కోట్లుగా నమోదైంది. త్రైమాసిక కాలంలో వాహన విక్రయాలు మెరుగ్గా ఉండటం ఎంతగానో కలిసివచ్చిందని కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.726 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.8,300 కోట్ల నుంచి రూ.10,031 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 14.6 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. కంపెనీ చైర్మన్ ఎమిరెటస్ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్కో షేరుకు రూ.75 మధ్యంతర డివిడెండ్‌తో పాటు రూ.25 ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది.