తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే 4.31 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.శుక్రవారం రోజున స్వామివారిని 62 వేల 593 మంది భక్తులు దర్శించుకున్నారు. 18 వేల 517 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు హుండీ కానుకల ద్వారా మొత్తం రూ.4.31 కోట్లు ఆదాయాన్ని అందించారు. మరోపైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 8 గంటల సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఇక తిరుమల శ్రీవారిని తమిళ హీరో జయం రవి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐరీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. మరోవైపు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఆరాధన మహోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆస్థాన మండపంలో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తనం, హరిదాస రంజని సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 3500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.