ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా.. 2014లో మాదిరిగానే మూడుపార్టీలు జతకడతాయా.. అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఢిల్లీలో అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. దీంతో ఏపీ పాలిటిక్స్ కాస్తా ఓవర్ టు ఢిల్లీగా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న అమిత్ షా.. పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో త్వరలోనే ఎన్డీఏలోకి కొత్తమిత్రులు వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలకే ఫ్యామిలీ ప్లానింగ్ కానీ రాజకీయాల్లో కూటమిలో ఎంత మంది సభ్యులుంటే అంత బలమని అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ కూటమిలోని మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక పంజాబ్‌లోనూ అకాళీదళ్‍తో చర్చలు జరుగుతాయని అన్నారు.
అయితే ఎన్డీఏ కూటమిలో నుంచి టీడీపీ, అకాలీదళ్, శివసేన పార్టీలు గతంలో బయటకు వచ్చేశాయి. 2014 ఏపీ శాసనసభ ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళ్లారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వారికి మద్దతు ప్రకటించింది. అయితే 2019 ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో అప్పటి సీఎం చంద్రబాబు.. కేంద్రంలోని బీజేపీతో ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీచేశాయి. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.
అయితే 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతాయని రెండుపార్టీల నేతలు ప్రకటించారు. ఈ కూటమిలోకి బీజేపీని కూడా తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షా నివాసానికి వెళ్లి ఏకాంతంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ రాగానే జనసేన అధినేత పవన్‌తో సీట్ల కేటాయింపులపై కూడా చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ వైపు పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూనే.. మరోవైపు ఎన్డీఏలోకి కొత్తమిత్రులు వస్తారంటూ మాట్లాడటం రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదు.