ఉద్యోగ సంఘాల నేతలతో సోమవారం ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ చర్చలు చాలా కీలకంగా మారనున్నాయి. చర్చలు సఫలం కాకుంటే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సోమవారం చర్చల్లో ఏం జరుగుతుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం చర్చల్లో ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. ఉద్యోగుల ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పెండింగ్ డీఏలు చెల్లించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు విడుదల చేయాలని కోరుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్ల మీద ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సోమవారం మంత్రుల బృందం చర్చలు జరుపుతుంది.
మరోవైపు ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకుంటే ఏం చేయాలనే దానిపైనా ఉద్యోగ సంఘాలు ముందస్తు నిర్ణయానికి వచ్చాయి. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోత ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని.. ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంల 104 ఉద్యోగ సంఘాలు, కార్యవర్గంతో చర్చలు జరిపామని, ఈ చర్చల్లోనే ఉద్యమ కార్యాచరణ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగా ఫిబ్రవరి 14న నల్ల బ్యాడ్జిలు ధరించి అన్ని కార్యాలయాల్లో మెమొరాండాలు ఇస్తామని తెలిపారు. 15, 16వ తేదీలలో భోజన విరామ సమయంలో నిరసన చేస్తామని వివరించారు. 17న తాలుఖా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహణ.. 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా, 21నుంచి 24 వరకు అన్ని జిల్లాల పర్యటన చేస్తామని తెలిపారు. చివరగా ఫిబ్రవరి 27న ఛలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఏ నిమిషం నుంచైనా మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa