ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. వైసీపీ, టీడీపీ అనే తేడా లేకుండా అధికార, విపక్షాలపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మీద కూడా వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మీద షర్మిల ఆరోపణలకు వైసీపీ నేతలు సజ్జల, మంత్రి రోజా, కొడాలి నాని వంటి నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో నగరిలో పర్యటించిన వైఎస్ షర్మిల.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో మాట్లాడిన షర్మిల.. రోజా మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా. నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ.. ఈవిడతో పాటు రోజా అన్నలు, భర్త కలిపి నగరి నియోజకవర్గానికి నలుగురు మంత్రులు. ఇసుక, మట్టి, గ్రావెల్, స్థలాలు ఇలా అన్నీ దోపిడీ. ఎక్కడ చూసినా అవినీతే" అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. రోజాను ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనేవారన్న షర్మిల.. అప్పట్లో వైఎస్ఆర్‌ను పంచె విప్పి కొడతానంటూ ఆమె చేసిన మాటలు గుర్తున్నాయని అన్నారు. ఇక తన గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదన్నారు షర్మిల. తనను ప్రేమించినంతగా వైఎస్ఆర్ ఎవరినీ ప్రేమించలేదని అన్నారు. వైఎస్ఆర్‌కు గౌరవం లేని చోట తాను ఉండలేనని, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ అంటే ఉన్న అపారమైన గౌరవంతోనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు.
ఇక తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీని మూసేశారంటూ వస్తున్న విమర్శలపైనా షర్మిల స్పందించారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీని మూసేయలేదన్న షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఉన్నంత వరకూ వైఎస్ఆర్టీపీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. గొప్ప ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారన్న షర్మిల.. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అన్నీ వస్తాయని అన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన డబ్బులు తేవాలంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా షర్మిల రియాక్టయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నేను డబ్బులు తీసుకువస్తే మీరేమైనా గాడిదలు కాస్తున్నారా అంటూ వైసీపీ మంత్రులపై మండిపడ్డారు. కేసీఆర్‌తో ఇన్నాళ్లూ దోస్తీ చేసిన వైసీపీ నేతలకు రాష్ట్ర విభజన సమస్యలు అప్పడు కనిపించలేదా అని ప్రశ్నించారు.
నోరు ఉంది కదా అని పారేసుకోకంటూ రోజాకు సలహా ఇచ్చిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో తనపై అధిక ప్రసంగం చేసిన వాళ్లను జనాలు ఓడగొట్టిన విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ హెచ్చరించారు. వారంతా ఇంట్లో కూర్చున్నారని.. రేపు రోజా గతి కూడా అంతేనంటూ వ్యాఖ్యానించారు. బాపట్లలో ఒకతను తనపై ఇష్టానుసారం మాట్లాడాడన్న షర్మిల.. వైఎస్ఆర్ బిడ్డను కాబట్టే అడుగు బయటపెట్టగలిగిందంటూ అన్నారని గుర్తుచేశారు. ఒక్క నిమిషం తాను వైఎస్ఆర్ బిడ్డను కాదనే విషయాన్ని పక్కనబెడతానని.. ఎవరొస్తారో, ఎంతమంది వస్తారో రావాలంటూ సవాల్ చేశారు. ఎవరేంటో చూసుకుందామంటూ షర్మిల ఛాలెంజ్ చేశారు.
వైసీపీ కోసం తాను మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్న షర్మిల .. వైసీపీ మొక్కగా ఉన్నప్పుడు తాను ఎరువు వేశానని, ఇప్పుడు చెట్టు అయ్యాక తన అవసరం లేదంటున్నారని మండిపడ్డారు. ఆడ బిడ్డ అని చూడకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీకి బానిసలుగా మారాయన్న షర్మిల.. ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.