ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టిపెట్టాయి. రాజకీయ పార్టీల అధినేతలు అందరూ కార్యక్షేత్రంలోకి దూకి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్‌లో భాగంగా తొలిరోజు అంటే బుధవారం భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించాల్సి ఉంది. కానీ జనసేనకు ఊహించని షాక్ తగిలింది.
బుధవారం భీమవరం వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో వెళ్లేందుకు జనసేన నేతలు సైతం ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని విధంగా.. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేనాని భీమవరం పర్యటన వాయిదా పడింది. భీమవరం విష్ణు కాలేజీలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు విద్యుత్, రోడ్డు భవనాల శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు.
దీనిపై జనసేన నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్‌కై కలెక్టర్, పోలీసులకు దరఖాస్తు చేసినట్లు జనసేన నేతలు చెప్తున్నారు. కలెక్టర్, పోలీసు శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందనీ.. అయితే విద్యుత్, ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు. దీంతో భీమవరం పర్యటన వాయిదా పడిందనీ, ఎప్పుడనేదీ తర్వాత చెప్తామని వెల్లడించారు.
అయితే గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ ఈ హెలిప్యాడ్‌లోనే దిగారనీ.. అప్పటికీ ఇప్పటికీ హెలిప్యాడ్ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు ఏమి లేవని జనసేన నేతలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ టూర్‌కు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్ళు ఉన్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందని జనసేన నేతలు మండిపడుతున్నారు.