‘‘యాత్ర 2’’ సినిమాలో సోనియా గాంధీ పాత్రపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఏఐసీసీ నెంబర్ నరహరిశెట్టి నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీపై బురదజల్లడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రానికి చేసిందేమి లేదని ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. ప్రజాదరణ కోసం బినామీలతో యాత్ర సినిమాను జగన్ మోహన్‌రెడ్డి తీయించుకున్నారని ఆరోపించారు. జగన్‌కు ఏలా అయితే ప్రజాదరణ కరువైందో.. యాత్ర సినిమాకు కూడా ప్రజాదరణ కరువైందన్నారు. సినిమా నిలుపుదల చెయ్యాలని హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. గవర్నర్‌ను కలవడానికి అనుమతి అడిగామని.. ఆయన దృష్టికి కూడా సినిమాలో సోనియా గాంధీ పాత్రను తీసుకెళ్తామన్నారు. మీరు చేసిన కుంభకోణాలపై జగన్ హీరోగా ఉండి సినిమా తీయొచ్చుగా అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని విషయంపై మళ్ళీ కొత్త పదం పాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన భూములు గాలికి వదిలేసి అభివృద్ధి చెయ్యలేక రైతులను నాశనం చేశారన్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలపై ఎన్నో రకాల కామెంట్స్ చేస్తున్నారని.. మీకోసం ఆమె ప్రజాక్షత్రంలో పోరాటం చేసింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. ‘‘రండి.. ప్రజా క్షేత్రంలో తెల్చుకుందాం’’ అంటూ నరహరిశెట్టి నరసింహారావు సవాల్ విసిరారు.