16వ నెంబరు జాతీయ రహదారిపై తుని రూరల్ వి.కొత్తూరు కూడలి వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టిన ఘటనలో 21 మంది గాయాలపాలయ్యారు. రాజమహేంద్రవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అక్కడి నుంచి తునికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. హైవే రోడ్డు నుంచి తుని సర్వీసు రోడ్డుకు మళ్ళే క్రమంలో వి.కొత్తూరు కూడలి వద్ద బెంగాల్ నుంచి కేరళ వెళుతున్న లారీ ఆర్టీసీ బస్సును బలంగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో లారీ డ్రైవర్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయాలపాలయ్యారు. భారీ శబ్దంతో లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. రోదనలు మిన్నంటాయి. స్థానికులతో పాటు సమీప రూరల్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. గాయపడ్డ 21 మందిని 108లో తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కిర్లంపూడి మండలం వేలంకి గ్రామానికి చెందిన ఐతా అప్పలరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బస్సులో ప్రయాణిస్తున్న వారు శుభాకార్యాలకు వెళుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. సంఘటన స్థలంతో పాటుగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తహసీల్దార్ భరత్‌రెడ్డితో పాటు రూరల్ సీఐ పరామర్శించారు. రూరల్ ఎస్‌ఐ డి.రమేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.