వాలంటీర్లకు వందనం సభలో జగన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు ప్రజాసేవకులని, వారితో దేశంలో ఎక్కడా లేని సేవలు అందిస్తున్నామని జగన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలు.. వాటికి సంబంధించి వాలంటీర్లే వైసీపీ భావిలీడర్లు పేరుతో సాక్షిపత్రికలో రాసిన రాతలతో వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయనే చెప్పాలన్నారు. వాలంటీర్లు వైసీపీ నాయకులైతే, వారే తన సైన్యమైతే జగన్ రెడ్డి ఐదేళ్లుగా ఏ చట్టం ప్రకారం వాలంటీర్లకు రూ. 9,663 కోట్లు దోచిపెట్టారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం వారికి శిక్షణ ఇచ్చి, వారిని ప్రజల్లోకి పంపి తన పార్టీ పనులు చేయించుకున్నారని నిలదీశారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలు వాలంటీర్ల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చాయన్నారు. వాలంటీర్లు వైసీపీ భావి నాయకులైతే, వాలంటీర్లను రెగ్యులరైజ్ చేసి, వేతనాలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చాలని అడిగారు. భవిష్యత్‌లో రాబోయే ఏ ప్రభుత్వమైనా వైసీపీ నాయకులైన వాలంటీర్లకు ఎలాంటి సాయమైనా ఎందుకు చేయాలని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలపై, సాక్షి కథనంపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రజాసేవకుల ముసుగులో జగన్ రెడ్డి ఇన్నేళ్ల నుంచీ వాలంటీర్లకు దోచిపెట్టిన రూ.9,663 కోట్ల ప్రజల సొమ్ముని అతని నుంచే రాబట్టాలని బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.