టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల వల్ల నష్టపోయిన వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని.. పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల మంది పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, మిత్రపక్షాలతో పొత్తుల గురించి మాట్లాడారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు ఉంటాయి.. అవన్నీ కొలిక్కి రావడానికి సమయం పడుతుంది అన్నారు.
ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని.. పొత్తులకు పార్టీ నేతలందరూ సహకరించాలని కోరారు. రాజకీయంగా నష్టపోయినా పొత్తు ధర్మంతో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చి అవకాశాలు కల్పిస్తామన్నారు. పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే అందరికీ ఏదో ఒక అవకాశం వస్తుందన్నారు. ప్రతిపక్షం లో అనేక బాధలు పడ్డామని.. రాష్ట్రం కూడా నష్టపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీని ఇంటికి పంపితేనే అన్ని సమస్యలకూ పరిష్కారం వస్తుంది అన్నారు. జగన్‌తో విసిగిపోయిన వైఎస్సార్‌సీపీ నేతలు చాలామంది పార్టీలో చేరతామని ముందుకొస్తున్నారని.. మంచివాళ్లు, పార్టీకి ఉపయోగపడతారని అనుకుంటు న్న వారిని మాత్రం తీసుకుంటున్నామని చెప్పారు.
అటువంటి వారి చేరికలను ఆహ్వానించి వారితో కలిసి పనిచేయాలని సూచించారు. రా కదలిరా సభలు ముగుస్తున్నందున త్వరలో మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వస్తోందని.. ప్రతి నియోజకవర్గంలో ఈ సభలను నిర్వహించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. జగన్ మోసం చేశారన్న భావన బీసీల్లో గట్టిగా ఏర్పడిందని.. బీసీల అభ్యున్నతికి పెద్ద పీట వేసిన టీడీపీలో వారికి ఎప్పుడూ ప్రాధాన్యం తగ్గదన్నారు. ఎన్నికలకు సమయం ఇంకా 50 రోజులే ఉన్నందువల్ల పార్టీలో అన్ని స్థాయుల నేతలు సీరియ్‌సగా తీసుకుని పనిచేయాలన్నారు.
ప్రతి 50 ఇళ్లకు ఒకరి చొప్పున కుటుంబ సారథులను నియమించాలని, ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని.. నిర్లక్ష్యం చేయవద్దని పార్టీ నేతలకు చెప్పారు. జగన్ సినిమా అయిపోయింది.. అసలు సినిమా ఇప్పుడు మొదలైంది.. సిద్ధంగా ఉండాలన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అమరావతిపై కక్షగట్టి సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. విషప్రచారం చేయించడంతో పాటు అధికార బలాన్ని ఉపయోగించి ఉద్యమకారుల్ని చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు.
జగన్, వైఎస్సార్‌సీపీ విధ్వంసానికి అద్దం పట్టిన చిత్రం రాజధాని ఫైల్స్ అన్నారు చంద్రబాబు. అందుకే సినిమా విడుదల కాకుండా జగన్ ప్రయత్నించారని.. కానీ హైకోర్టు వారి ఆటలు సాగనివ్వలేదన్నారు. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చిందని.. తెలుగు ప్రజలందరూ ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. రాజధాని ఫైల్స్ సందేశాత్మక చిత్రమని.. అమరావతి ఉద్యమాన్ని, రైతుల పోరాటాన్ని కళ్లకు కట్టిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.