ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నారైలతో భారతీయుల పెళ్లిళ్లు చేస్తున్నారా.. ఈ కొత్త నిబంధనలు చూశారా

national |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2024, 12:02 AM

భారతీయ పౌరులను ఎన్నారైలు పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నారైల వివాహాలపై సూచనలు ఇవ్వాలని లా కమిషన్‌ను కేంద్రం ఆదేశించగా.. సమగ్ర విచారణ జరిపిన లా కమిషన్ తాజాగా కీలక సిఫార్సులు చేసింది. ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి రూపొందించనున్న కొత్త చట్టానికి లా కమిషన్ కీలక సూచనలు అందించింది. దీంతో ఇకపై ఎన్నారైలు భారతీయులను పెళ్లి చేసుకోవాలని అన్ని రకాల నిబంధనలను పాటించాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు ఏంటో ఇప్పుడు చూద్దాం.


ఎన్నారైలకు సంబంధించిన వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాల సమస్యలపై సమగ్ర చట్టం పేరిట కీలకమైన సిఫార్సులతో కూడిన నివేదికను లా కమిషన్.. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు అందించింది. ఈ ప్రతిపాదిత చట్టం సంపూర్ణంగా, సమగ్రంగా ఉండాలని రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సూచించింది. ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాలకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ చట్టం ఉండాలని పేర్కొంది.


ఈ క్రమంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌‌కు రాసిన లేఖలో రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయులను పెళ్లి చేసుకొని ఎన్నారైలు మోసగిస్తున్న ఘటనలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారైలు తమ భార్యలను పెళ్లి తర్వాత తీవ్రంగా ఇబ్బందులు, హింసకు గురి చేస్తున్న సంఘటనలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. అయితే కొత్తగా తీసుకురానున్న కఠిన చట్టాన్ని కేవలం ఎన్నారైలకు మాత్రమే కాకుండా భారత పౌరులకు కూడా వర్తింపజేయాలని జస్టిస్ రీతు రాజ్ అవస్తీ సూచించారు.


నాన్ రెసిడెంట్ ఇండియన్స్-ఎన్‌ఆర్‌ఐ, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియన్స్-ఓసీఐలతో భారత పౌరులకు జరిగే వివాహాలను భారత్‌లో రిజిస్టర్‌ చేయడాన్ని తప్పనిసరి చేయాలని లా కమిషన్ ప్రధాన సూచన చేసింది. ఈ క్రమంలోనే కొత్తగా రూపొందించే చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉండాలని తెలిపింది. ఇక ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి వారెంట్లు జారీ చేయడం, నోటీసులు పంపించడానికి సంబంధించిన నిబంధనలను కూడా స్పష్టంగా పేర్కొనాలని సూచించింది.


1967 పాస్‌పోర్ట్‌ చట్టానికి సవరణలు చేసి.. పెళ్లి అయిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని పేర్కొంది. దీంతోపాటు భార్యాభర్తల రెండు పాస్‌పోర్ట్‌లను అనుసంధానం చేసేలా కొత్త రూల్ తీసుకురావాలని చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరి పాస్‌పోర్ట్‌లపై మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండేలా చూడాలని తెలిపింది. వివాహ నమోదు సంఖ్య ఎన్నారైల వివాహానికి సాక్ష్యంగా నిలవడంతో పాటు వారి రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. భార్యభర్తల రికార్డులు హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఉండాలని.. ఇవే వివరాలు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com