ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విషాదం జరిగింది. పెళ్లి వేడుక కోసం వేసిన స్టేజీ కుప్పకూలింది. పెళ్లికి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేడియం గేట్ నంబర్ 2 వద్ద ఏర్పాటు చేసిన భారీ స్టేజీ కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. ఆ భారీ స్టేజీ కూలిపోవడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో 25 మంది కార్మికులు గాయాలపాలయ్యారు. మరో ఇద్దరు కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. అనేక ఫైర్ ఇంజిన్లను సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా అనే విషయాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో స్టేజీ కూలిన సంఘటనలో గాయపడిన వారిని సమీపంలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఈ ఘటనలో శిథిలాల కింద ఇంకా కొందరు కార్మికులు చిక్కుకున్నారేమోననే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ స్టేజీ కూలిన ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే స్టేడియంలో జరగనున్న ఓ పెళ్లి కోసం తాత్కాలికంగా భారీ నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడ పనిచేసే కార్మికులు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. దీంతో ఘటన సమయంలో అక్కడ ఎక్కువమంది కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.