దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓ ఘోర రైలు దుర్ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దాని 10 బోగీలు బోల్తాపడ్డాయి. ఢిల్లీలోని పటేల్ నగర్-దయాబస్తీ సెక్షన్‌లో చారమండి జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఆ గూడ్స్ రైలు పట్టాలు తప్పడాన్ని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీశారు. రైలు పట్టాలు తప్పడం, ఆ తర్వాత బోగీలు బోల్తాపడిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
శనివారం ఉదయం 11.50 గంటల సమయంలో ఈ రైలు ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ముంబై నుంచి చండీఘడ్ వెళ్తున్న ఆ గూడ్స్ రైలులో ఐరన్ షీట్ రోల్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడటంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లలో కొన్నింటిని రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా.. చనిపోయారా అనే విషయాలను రైల్వే అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గూడ్స్ రైలు పల్టీ కొట్టడంతో అక్కడ సహాయక చర్యలు ప్రారంభించామని.. రైల్వే ట్రాక్ చెల్లాచెదురుగా పడిపోయిందని.. వాటిని సరిచేస్తున్నట్లు వివరించారు.