ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి అద్దె బస్సులు తీసుకునేందుకు సిద్ధమైంది. మొత్తం 541 అద్దె బస్సులు తీసుకునేందుకు టెండర్లను ఆహ్వానించింది. 2022 మే నెలలో 998 బస్సులకు టెండర్లు పిలిచి పలు దఫాలుగా దాదాపు 850 బస్సుల వరకు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ 541 అద్దె బస్సుల కోసం ఎంఎస్‌టీసీ పోర్టల్‌లో ఈనెల 21 నుంచి మార్చి 6 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. మార్చి 14వ తేదీన ఉదయం 10 గంటలకు రివర్స్ వేలం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం టెండర్లు పిలిచిన 541 బస్సుల్లో.. ఏసీ స్లీపర్లు 2, నాన్ ఏసీ స్లీపర్లు 9, సూపర్‌లగ్జరీలు 22, డీలక్స్‌లు 33, ఎక్స్‌ప్రెస్‌లు 168, అల్ట్రా పల్లెవెలుగులు 74, పల్లెవెలుగులు 225, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 3, సిటీ ఆర్డినరీలు 5 ఉన్నాయి. ఈ బస్సుల్ని జిల్లాల వారీగా కేటాయిస్తారు. ఈ బస్సుల కోసం టెండర్లు వేయాలనుకుంటున్నవాళ్లు.. ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. APSRTC వెబ్‌సైట్ http://apsrtc.ap.gov.inలో అందుబాటులో రూట్‌లు, టెండర్ పరిస్థితులు, బస్సుల స్పెసిఫికేషన్‌లు, టెండర్ షెడ్యూల్ వివరాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు టెండర్లు దాఖలు చేయొచ్చని ఆర్టీసీ తెలిపింది.