ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ‘సిద్ధం’ అంటూ విపక్షాలకు సవాల్ విసిరిన వైఎస్ జగన్.. మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహిళలు, రైతాంగాన్ని ఆకట్టుకునేలా జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసొచ్చినా సరే.. ఈ కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు జగన్ ఆఖరి అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు.
రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీని జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చే అవకాశం ఉందని సమాచారం. రుణమాఫీ ప్రకటించడంతో.. రైతాంగాన్ని తమవైపు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారట. నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించే ‘సిద్ధం’ బహిరంగ సభలో జగన్ ఈ విషయాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పిస్తా జగన్ హామీ ఇవ్వనున్నారని కూడా తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంది. అయితే తెలంగాణ తరహాలో కాకుండా.. ఉచిత బస్సు ప్రయాణానికి జగన్ సర్కారు కండీషన్లు పెట్టే అవకాశం ఉంది. వారంలో అన్ని రోజులపాటు కాకుండా.. ప్రత్యేకించిన రోజుల్లో, కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించే యోచనలో జగన్ ప్రభుత్వం ఉందని సమాచారం.
వీటితోపాటు మరికొన్ని వరాలను సైతం వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పొందుపర్చే అవకాశం ఉంది. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ నవరత్నాలను ప్రకటించింది. జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని ఐదేళ్లపాటు అమలు చేసి చూపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. నవరత్నాల అమలు విషయంలో వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి కొత్త హామీలు ఇచ్చినా.. జగన్ వాటిని అమలు చేస్తారని జనం విశ్వసిస్తారని వైఎస్సార్సీపీ వర్గాలు భావిస్తున్నాయి.
వాస్తవానికి 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే రైతులకు రుణమాఫీ చేస్తామనే అంశాన్ని పొందుపర్చాలని వైఎస్ జగన్‌పై సన్నిహితులు ఒత్తిడి చేశారు. కానీ ఆయన మాత్రం అమలు చేయలేని హామీలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ హామీ ఇస్తే.. ఆ ఎన్నికల్లో వైఎస్సా్ర్సీపీ గెలిచేదని.. కానీ ఇచ్చిన మాట తప్పడం కంటే అధికారంలోకి రాకుండా ఉండటమే ఉత్తమమని జగన్ అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు జగనే రుణమాఫీ హామీ దిశగా అడుగులేస్తుండటం గమనార్హం.