ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్(ఆర్థికంగా వెనుకబడిన వారికి) రిజర్వేషన్లు కల్పించింది. మొత్తం కోటాలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లపై ఎన్నో అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయా అని ప్రశ్నించింది.
అగ్ర కులాల్లోని పేదలకు మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా లేక ఇతర కులాల్లోని పేదలకు కూడా వర్తిస్తాయా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు అడిగింది. ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు కేవలం జనరల్ కేటగిరీ అభ్యర్థులకే వర్తిస్తాయా లేదంటే ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా వర్తిస్తాయా అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రవి విజయమలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై 6 వారాల్లో స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని.. పిటిషన్ వేసిన అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ పేర్కొంది. పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని.. ఈ రిజర్వేషన్‌లను రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టును పిటిషనర్లు కోరారు.