సీఎం జగన్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రేంజులో ఫైరయ్యారు. అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతున్నారన్న చంద్రబాబు.. అందులో అన్ని అశుద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాప్తాడు సభలో జగన్ చేసిన విమర్శలపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రాప్తాడు సభ వేదికగా సీఎం జగన్ విసిరిన ఛాలెంజ్ మీద స్పందించిన చంద్రబాబు.. వైసీపీ అరాచక, విధ్వంసక పాలనపై జగన్‌తో తాను చర్చకు సిద్ధమన్నారు. బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు మాని దమ్ముంటే బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఏ అంశం మీద అయినా, ఏ రోజైనా, ఎక్కడైనా తాను చర్చకు రెడీననీ.. చర్చకు వచ్చే దమ్ము జగన్‌కి ఉందా అంటూ ప్రశ్నించారు.
ఇక 2019 ఎన్నికలే ప్రజలు జగన్‌కి ఇచ్చిన ఆఖరి అవకాశమని చంద్రబాబు అన్నారు. ఆ ఒక్క ఛాన్సే ఆఖరి ఛాన్స్ అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఫ్యాన్ రెక్కలు విరిచేస్తారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల కసి, ఆలోచన అర్థమైన జగన్ ప్రజలను ఏమార్చే పనిలో ఉన్నారంటూ విమర్శించారు. ఓటమి భయంతోనే ఇంఛార్జిల బదిలీలు అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. 77 మందిని జగన్ మడతపెట్టారన్న చంద్రబాబు.. మిగిలిన వారిని ఏపీ ఓటర్లు వచ్చే 50 రోజుల్లో మడతపెడతారని ఎద్దేవా చేశారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్న జగన్ సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఇక రాప్తాడు సభలో సీఎం జగన్ విపక్షాలపై పంచులతో విరుచుకుపడ్డారు. సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన గ్లాస్ సింకులో ఉండాలి.. మన ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో ఉండాలంటూ సీఎం జగన్ పంచులేశారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రసంగానికి కౌంటర్ వేసిన చంద్రబాబు.. ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ మూల చూసిన అభివృద్ధి కాదు.. విధ్వంసం కనిపిస్తోందన్న చంద్రబాబు.. ఏ ఊరుకెళ్లినా జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలు పెత్తందారుడైన జగన్‌కు ప్రజలకు మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణించారు.