జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. పలువురు నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ .. ఎన్నికలను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బులు పెట్టకుండా రాజకీయాలు చేయడం కుదరని పని అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందేనన్న పవన్.. ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని అన్నారు. కనీసం భోజనాలకైనా పెట్టుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.. ఇక ఓట్లు కొంటారా లేదా అని నాయకుల ఇష్టమంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆపమని తేల్చిచెప్పారు.
" జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన్నట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడూ నేను అలా అనలేదు. ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం కూడా 45 లక్షలకు పెంచింది. డబ్బులు ఖర్చుచేయకుండా రాజకీయాలు చేద్దామంటే ఈ రోజుల్లో కుదరని పని. కనీసం భోజనాలైనా పెట్టుకుండా పాలిటిక్స్ చేద్దామంటే అవదు. నా కోసం అభిమానులు వస్తారు. అందుకే డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందేనని నాయకులకు అందరికీ ముందే చెప్పా. ఇక ఓట్లు కొనాలా వద్దా అనేది మీ నిర్ణయం. కనీసం 2029 తర్వాతైనా డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన డెవలప్ మెంట్ జరుగుతుంది " అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇదే సమావేశంలో వైఎస్ జగన్ మీద పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. మనుషులను విడగొట్టడం ఆయనలో ఉన్న విష సంస్కృతి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు బిడ్డలను వైఎస్ఆర్ సమానంగా పంచి ఇస్తే సొంత చెల్లికి జగన్ అన్యాయం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చెల్లికే అన్యాయం చేసినవాడు మనకేం న్యాయం చేస్తారన్న పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. భీమవరం పర్యటనలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సహా పలువురు కీలక నేతల ఇళ్లకు వెళ్లిన పవన్ కళ్యాణ్ వారితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేనాని భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. నేతలు ఇళ్లకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తనకు మద్దతు ఇవ్వాలని వారిని కోరినట్లు తెలుస్తోంది.