పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల జీవితాల్లో సంతోషాలు నింపుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్ అగ్రహారంలో కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు.