ఏపీ సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స, సజ్జల, సీఎస్ జవహర్ రెడ్డిని సెక్రటేరియట్ ముందు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. తమ సీపీఎస్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే సమావేశానికి వెళ్తున్న తమను అడ్డగించిన ఉద్యోగులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాక మునుపే బకాయిలు చెల్లించాలని కోరిన సీపీఎస్ ఉద్యోగులపై మంత్రి బొత్స, సలహాదారు సజ్జల చిరాకు పడ్డారు. ఎన్నికల కోడ్‌కు బకాయిలుకు విడుదలకు సంబంధం ఏమిటని బొత్స, సజ్జల ప్రశ్నించారు. మీటింగ్ వచ్చి మాట్లాడాలని.. ఇలా రోడ్ల పై తిరగద్దు అంటూ బొత్స ఉచిత సలహా ఇచ్చారు. తమకు ఆహ్వానం లేదని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉందని ఉద్యోగులు తెలిపారు. వారిని మరోమారు వచ్చి కలవాలని మంత్రి బొత్స, సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.