ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త హెలికాప్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖర్చుతో విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఎంపీ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖర్చుతో ఈ విధంగా హెలికాప్టర్ల ఏర్పాటుపై వెంటనే జోక్యం చేసుకోవాలని ఈసీని కోరారు. రెండు హెలికాప్టర్లకు నెలకు రూ.3.82 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడానికే ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎన్నికల ఖర్చు నుంచి తప్పించుకోవడానికే జగన్ ఈ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ హెలికాప్టర్లలోనే భారీగా నగదును తరలించేలా జగన్ యత్నించే అవకాశం ఉందని ఈసీకి తెలిపారు. జగన్ ప్రభుత్వ వ్యయంతో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ హెలికాప్టర్ల వాడకాన్ని అడ్డుకోవాలని సీఈసీని ఎంపీ కోరారు. హెలికాప్టర్లను తనిఖీలు చేసేందుకు కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు వినతి చేశారు.