రాష్ట్రాభివృద్ధి కోసమే జనసేన, తె లుగుదేశం పార్టీ కలిశాయని జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎలాంటి రాజకీయ లబ్ధిని ఆశించి తాము కలిసి పసిచేయడం లేదన్నారు. ఈ నెల 28న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారి సమీపంలో జరిగే టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభా ప్రాంగణాన్ని శుక్రవారం తాడేపల్లిగూడెం జనసేన ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివా్‌సతో కలిసి ఆయన సందర్శించారు. సభా వేదిక, హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సభకు సుమారు 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, ఆ దిశగానే ఏర్పాట్లు చేస్తున్నామని మనోహర్ తెలిపారు. సభా వేదికపై ఇరు పార్టీల నుంచి సుమారు 500 మంది ఆశీనులు కానున్నానన్నారు. బహిరంగ సభకు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చే టీడీపీ, జనసేన అభిమానులు , ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సీఎం జగన్ పాలనతో ప్రజలంతా విసిగిపోయారని మనోహర్ అన్నారు. ఎన్నికల అవసరాల కోసం రెండు హెలికాప్టర్లు సీఎం ఎందుకు తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రధానికి మాత్రమే సెక్యూరిటీ కారణాల వల్ల రెండు హెలికాప్టర్లు వినియోగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంత సులభంగా వదలబోం. దీని వెనుక ఉన్న అధికారులదే బాధ్యత. మేం అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రతి అంశంపై నా సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం’’ అని తెలిపారు. రాష్ట్ర సంక్షేమం కోసమే జనసేన అధినేత పవన్‌కల్యాణ్... బీజేపీ తో పొత్తు కుదుర్చుకునేందుకు చూస్తున్నారన్నారు. త్వరలోనే ఎన్డీ యే పొత్తుపై స్పష్టత వస్తుందని చెప్పారు. పొత్తులో భాగంగా ఎవరికి సీటు దక్కినా ఎవరూ బాధపడరని ఒక ప్రశ్నకు సమాధానంగా మనోహర్ తెలిపారు.