తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నడుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలుచేస్తోంది. ఇక ఈ పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని కూడా అందరికీ తెలిసిందే. బస్సులో తిరిగే వారి సంఖ్య పెరగడం, జీరోటికెట్ల డబ్బులను ఆర్టీసీకి ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో అటు ఆర్టీసీ, ఇటు మహిళలు సంతోషంలో ఉన్నారు. అయితే ఏపీలోనూ ఇలాంటి పథకం తేవాలని అప్పట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ ఇప్పటికే హామీ కూడా ఇచ్చింది. కానీ అంతకుముందే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుంది.
ఏపీలోనూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. అయితే మీరు అనుకున్నట్లు అది మహిళలకు కాదండోయ్. విద్యార్థులకు మాత్రమే. వచ్చే మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి.. పరీక్షా కేంద్రాలకు ఉచితంగా వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి.. ఎగ్జామ్ సెంటర్ల వరకూ ఉచితంగా వెళ్లవచ్చనీ.. పరీక్ష పూర్తైన తర్వాత ఇళ్లకు రావచ్చని ఏపీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పల్లెవెలుగు. సిటీ ఆర్డినరీ సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. మరోవైపు ఏపీలో ఈ ఏడాది పది, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య సుమారు 16 లక్షల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.