టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా రిలీజైంది. అయితే జాబితాలో చాలా మంది టీడీపీ సీనియర్ నేతల పేర్లు కనిపించపోవటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీనియర్ నేతలను చంద్రబాబు పక్కనపెట్టారా.. లేదా ఆయా స్థానాలు పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందా అనేది అంతు బట్టకుండా ఉంది. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్తుందని.. జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీచేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీటుపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే కందుల దుర్గేష్‌కు వేరే చోట టికెట్ కేటాయించి.. గోరంట్లకే రాజమండ్రి రూరల్ టికెట్ ఇస్తారని తెలుగు తమ్ముళ్లు విశ్వాసంతో ఉన్నారు.
ఇక మరో నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు సైతం జాబితాలో కనిపించలేదు. 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా మైలవరం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ సైతం టీడీపీ వైపు చూస్తున్న నేపథ్యంలో.. మైలవరం సీటుపైనా, దేవినేని ఉమాపైనా చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు దేవినేని ఉమాను పెనమలూరు నుంచి బరిలో దింపాలనే ఆలోచనలోనూ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
ఇక జాబితాలో లేని మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రి గంటా ఇప్పటి వరకూ పోటీ చేసిన ప్రతిచోటా విజయం సాధిస్తూ వచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతూ విజయం సాధిస్తూ వస్తున్నారు గంటా శ్రీనివాసరావు. అయితే ఈసారి గంటాను విశాఖ నుంచి కాకుండా విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద బరిలో నిలపాలని టీడీపీ అధిష్ఠానం భావించింది. అయితే విశాఖ పట్నం జిల్లా నుంచే పోటీచేస్తానని.. చీపురుపల్లి వెళ్లడం ఇష్టం లేదని అధిష్టానానికి గంటా తేల్చిచెప్పారట. దీంతో మరోసారి గంటాను విశాఖ నార్త్ నుంచి పోటీ చేయిద్దామా లేదా... ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో స్థానంలో నిలుపుదామా అనే సంధిగ్ధంలో టీడీపీ అధినేత ఉన్నట్లు సమాచారం.
ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే సోమిరెడ్డికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా తొలి జాబితాలో కనిపించలేదు. ఇక ఏపీ టీడీపీ మాజీ చీఫ్‌గా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు, గుంటూరు జిల్లాలో యరపతినేని శ్రీనివాసరావు పేర్లు కూడా ఫస్ట్ లిస్టులో లేవు. అలాగే చింతమనేని ప్రభాకర్, కొమ్మాలపాటి శ్రీధర్, కందికుంట ప్రసాద్, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కేఎస్ జవహర్ పేర్లు కూడా జాబితాలో లేకపోవటంతో వీరి భవిష్యత్తు ఏంటనేది తెలియడం లేదు. తొలి జాబితాలో చోటు దక్కని వీరికి మలిజాబితాలో చోటు దక్కుతుందా.. అధినేత మనసులో ఏముందనేది అంతుబట్టకుండా మారింది.
మరోవైపు తెనాలి సీటు జనసేనకు కేటాయించడం.. అక్కడి నుంచి జనసేన తరుఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేత ఆలపాటి రాజా పరిస్థితి ఏంటనేది తెలియడం లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తుపైనా సందేహాలు నెలకొన్నాయి. ఇక విజయవాడ వెస్ట్ టికెట్ కావాలంటూ చంద్రబాబుకు రక్తాభిషేకం చేసిన బుద్ధా వెంకన్న పేరుతో సైతం తొలి జాబితాలో కనిపించలేదు.