టీడీపీ, జనసేన శ్రేణులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఓ మంచి ముహూర్తం చూసి... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 99 మందితో ఉమ్మడిగా తొలి జాబితాను వెల్లడించారు. ఇందులో 94 స్థానాలకు చంద్రబాబు టీడీపీ తరుఫున అభ్యర్థులను ప్రకటించగా.. పవన్ కళ్యాణ్ జనసేన తరుఫున ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే జనసేన పార్టీ 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలలో పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కానీ ఐదు మందితో మాత్రమే జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ వంటి నేతల పేర్లు ఉండగా.. అధినేత ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే జనసేనకు కేవలం 24 సీట్లు కేటాయించటంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు తగినన్ని సీట్లు రాలేదంటూ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 సీట్ల కోసం ఇంత అవసరమా, మరీ ఇంత మంచితనం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్‌లో 24 ఎమ్మెల్యే ట్రెండ్ అవుతోంది. అయితే 24 సీట్లు కేటాయించడంపై అసంతృప్తి వద్దంటూ పవన్ కళ్యాణ్ జనసైనికులకు సూచించారు. పొత్తుల్లో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గాల్సి వచ్చిందన్నారు.
కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దని.. విజయంలో 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 24 అసెంబ్లీ సీట్లతో పాటు.. 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే.. మొత్తంగా రాష్ట్రం లోని 40 నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు.చాలామంది పెద్దలు, పార్టీ నేతలు 40 నుంచి 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని తనతో చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
అయితే 2019 ఎన్నికల్లో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం నంబర్ గానే చూడొద్దని.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవటంతో ఇంకా ఆ సస్పెన్స్ కొనసాగుతోంది.