ప్రాచీనమైన యోగాలో స్థిరమైన అభివృద్ధి, శాస్త్రీయ పరిశోధనల పాత్రను భాగస్వామ్యం చేయడం.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా క్రమపద్ధతిలో యోగాను మరింత చేరువచేయాలనే లక్ష్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రెండో ఇండియన్ యోగా అసోసియేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ సదస్సు 26 వరకూ మూడు రోజుల పాటు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరుగుతోంది. ఈ సదస్సులో 25 రాష్ట్రాల యోగా కౌన్సిల్‌లు, ఈ రంగానికి చెందిన ప్రముఖ నిపుణులు, పరిశోధకులు, ట్రెయినర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇండియన్ యోగా అసోసియేషన్ (ఐవైఏ) ఛైర్మన్, మానవతావాది గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. ‘యోగా శతాబ్దాలుగా ఉంది.. కానీ దాని శాస్త్రీయ వివరణ ప్రతిచోటా చేరుకోవడానికి సమయం ఆసన్నమైంది... మన యోగ సంప్రదాయాల సారాంశం స్వచ్ఛతను మనం కాపాడుకోవాలి’ అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ఇండియన్ యోగా అసోసియేషన్ 2006 ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, విభిన్న సాంస్కృతిక వారసత్వాలు అనుసంధానం చేయడంలో నిమగ్నమై ఉంది.
ఇండియన్ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్, రచయిత, పరిశోధకుడు మా హన్సా మాట్లాడుతూ.. ‘జీవితంలో మూడు హెచ్‌లు ఉండాలి.. మొదటి ‘H’ కష్టపడి పని చేయండి.. మనం మన స్వంత వ్యక్తిత్వంతో ఉండాలి.. రెండో ‘H’ తల లేదా మనస్సు స్థిరంగా ఉండాలి.. మీరు ప్రతిదానిని సానుకూలంగా చూడాలి.. మూడో ‘H’ అనేది చేయి, తలతో పాటు సాగే హృదయం. వ్యక్తి సంపూర్ణంగా జీవించాలి.’ సూచించారు.
యోగాలో కీలకమైన మానసిక ప్రశాంతత లేకుండా ప్రపంచ శాంతి అసాధ్యమని ఆచార్య లోకేష్ ముని వివరించారు.; భారత అద్భుతమైన యోగా సంస్కృతి గురించి డాక్టర్ బసవారెడ్డి పంచుకున్నారు. ఇది శరీరం, మనసు, వాటిని ఎలా ఏకం చేయాలనే దాని గురించి జ్ఞానాన్ని అందిస్తుంది.. చివరికి ప్రకృతిలోని ప్రతిదాన్ని ఏకం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా నిపుణులు పద్మశ్రీ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర, డాక్టర్ట్ బసవారెడ్డి, ఆచార్య లోకేశ్ ముని, ఇండియన్ యోగా అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ సుబోధ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో యోగా శిక్షణ, పరిశోధనలకు సంబంధించి పలు ఒప్పందాలను కూడా కుదర్చుకున్నారు.