కోట్లాది మంది హిందువుల 5 శతాబ్దాల కల నెరవేరి.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో దివ్య రామ మందిరం జనవరి 22 వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఆ మర్నాడు అంటే జనవరి 23 వ తేదీ నుంచి అయోధ్యలో కొలువైన బాల రాముడిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులకు అవకాశం కల్పించారు. దీంతో ఇప్పటికీ అయోధ్యలో బాలరాముడి దర్శనాలు ప్రారంభమై నెల రోజులు దాటింది. ఈ క్రమంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా ఈ నెల రోజుల్లో వచ్చిన విరాళాలు.. అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న భక్తుల వివరాలను వెల్లడించింది.
ఈ నెల రోజుల్లో 60 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుని శ్రీరాముడి దివ్య దర్శనం చేసుకున్నారని తెలిపింది. అంతే కాకుండా అయోధ్య రామ మందిరానికి ఈ నెల రోజుల వ్యవధిలో రూ.25 కోట్ల మేర విరాళాలు అందినట్లు ట్రస్టు సభ్యులు తెలిపింది. ఇందులో 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. అయితే అయోధ్య రాముడికి ఆన్‌లైన్‌లో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధి ప్రకాశ్ గుప్తా శనివారం తెలిపారు. హుండీలో కానుకలతోపాటు చెక్కులు, డ్రాఫ్ట్‌ల రూపంలో అయోధ్య బాలరాముడికి విరాళాలు అందాయని పేర్కొన్నారు.
ఇక భక్తులు కానుకగా ఇచ్చే బంగారు, వెండి ఆభరణాల విలువను లెక్కించేందుకు వాటిని కరిగించడం, లెక్కించడం సహా ఇతర బాధ్యతలను భారత ప్రభుత్వ టంకశాలకు అప్పగించినట్లు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్ర తెలిపారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో శ్రీరామనవమి పండుగ రానుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకున్న తర్వాత వస్తున్న తొలి శ్రీరామనవమి కావడంతో భారీగా ఏర్పాట్లు చేసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఈసారి శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా సుమారు 50 లక్షల మంది భక్తులు అయోధ్యకు రావచ్చని ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా అంచనా వేశారు.
దీంతో బాలరాముడికి వచ్చే విరాళాలు కూడా భారీగా పెరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రసీదుల జారీకి కంప్యూటరైజ్డ్ కౌంటర్లతోపాటు ఆలయ ప్రాంగణంలో అదనపు హుండీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారీ మొత్తంలో అందే నగదు విరాళాల లెక్కింపు కోసం 4 ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్‌బీఐ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. పెద్ద మొత్తంలో నగదు లెక్కింపు కోసం ఒక ప్రత్యేక గదిని త్వరలో నిర్మించనున్నట్లు వెల్లడించారు.