సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ వ్యాప్తంగా తీరిక లేకుండా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ఉదయం ద్వారకలోని బెట్ ద్వారక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా దీపాన్ని కలుపుతూ నిర్మించిన భారతదేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ వంతెనకు సుదర్శన్ సేతు అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ సుదర్శన్ సేతుకు చాలా ప్రత్యేకతలు, విశిష్ఠతలు ఉన్నాయి.
దాదాపు రూ.980 కోట్లతో ఈ సుదర్శన్ సేతును నిర్మించారు. 2.32 కిలోమీటర్ల పొడవు ఉన్న సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. అంతే కాకుండా ఈ వంతెనపై ప్రత్యేకంగా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని వర్ణనలతో అలంకరించబడిన నడక మార్గాన్ని కూడా నిర్మించారు. ఇవే కాకుండా ఒక మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్‌లను ఈ సుదర్శన్ సేతుపై ఏర్పాటు చేశారు.
2017 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సుదర్శన్ సేతు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో 4 వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌పై 2.5 మీటర్ల వెడల్పు ఉన్న ఫుట్‌పాత్ కూడా ఉంది. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఇదే కాకుండా ఇవాళ మరిన్ని ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. రాజ్‌కోట్‌లో తొలి ఎయిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆ తర్వాత ఏపీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఎయిమ్స్ ఆస్పత్రులను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మొత్తం రూ.6300 కోట్లతో నిర్మించారు.