ప్రధాని నరేంద్ర మోదీ వయసు 73 ఏళ్లు. ఈ వయసులో కూడా నిత్యం పర్యటనలు, సమావేశాలు, బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలు, అధికారులతో మీటింగ్‌లు నిర్వహిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఆధ్యాత్మికత, దైవ చింతన కూడా ఎక్కువే. ఇవే కాకుండా అప్పుడప్పుడూ సాహసాలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా సముద్రం అడుగు భాగంలోకి వెళ్లి పూజలు చేసి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. డైవింగ్ ఎక్స్‌పర్ట్స్ ఆధ్వర్యంలో డైవింగ్ చేసి.. సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారక నగరంలో పూజలు నిర్వహించి వచ్చారు.
తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలే కాకుండా ఆధ్యాత్మిక పూజల్లో కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏలిన అద్భుతమైన ద్వారకా నగరాన్ని సందర్శించారు. అయితే ఆ ద్వారకా నగరం ప్రస్తుతం అరేబియా సముద్రంలో మునిగిపోగా.. స్కూబా డైవింగ్ చేస్తూ వెళ్లి ప్రధాని మోదీ ద్వారకను దర్శించుకున్నారు. మన దేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా పేర్కొనే ద్వారకా నగరాన్ని ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సాహసం చేసి అక్కడికి వెళ్లి దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ క్రమంలోనే పూర్తిగా హిందూ సంప్రదాయ వేషదారణ అయిన కాషాయ వస్త్రాలు ధరించిన నరేంద్ర మోదీ.. మూడు నామాలు పెట్టుకుని అరేబియా సముద్ర గర్భంలోకి వెళ్లారు. తనతోపాటు ద్వారకకు నెమలి పింఛాలను, పూజా సామాగ్రిని తీసుకెళ్లిన ప్రధాని.. అక్కడికి చేరుకుని పూజలు చేశారు. అంతకుముందు ద్వారకాధీష్ ఆలయంలో కూడా ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. నేను ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తితో ముడిపడి ఉన్నానని భావించాను. భగవాన్ శ్రీ కృష్ణుడు మా అందరినీ ఆశీర్వదించాలి. నేను సముద్రం లోతుకి వెళ్లినప్పుడు, దైవత్వాన్ని అనుభవించాను. ద్వారకాధీశుడి ముందు నమస్కరించి నెమలి ఈకలను శ్రీకృష్ణుడి పాదాల ముందు ఉంచాను. పురాతన ద్వారకా నగర అవశేషాలను చూడటంతో నా దశాబ్దాల కల నెరవేరింది’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ.. బెట్ ద్వారక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఓఖా పోర్టును బేట్ ద్వారకా దీపాన్ని కలుపుతూ కట్టిన దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ సుదర్శన్ సేతు.. 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ బ్రిడ్జిపై ప్రత్యేకంగా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని చిత్రాలు ఏర్పాటు చేశారు. ఒక మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్‌లను కూడా ఏర్పాటు చేశారు.