ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ సైనికుడి ప్రాణాలు కాపాడిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. పూణే నుంచి ఢిల్లీకి కాలేయం తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 25, 2024, 07:52 PM

కొండలు, లోయల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-ఐఏఎఫ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇక ప్రకృతి విపత్తు సమయాల్లో కూడా బాధితులను ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి, వారికి ఆహారాన్ని అందించడానికి భారత వైమానిక దళం ముందు నిలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన పనికి ఓ మాజీ సైనికుడి ప్రాణాలు దక్కాయి. మహారాష్ట్రలోని పూణే నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అత్యవసరంగా కాలేయంను ఎయిర్‌లిఫ్ట్ చేయడంతో ఆ మాజీ సైనికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్‌కు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.


ఫిబ్రవరి 23 వ తేదీ రాత్రి కీలక ఆపరేషన్ చేపట్టినట్లు భారత వైమానిక దళం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక మాజీ సైనికుడికి అత్యవసరంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ నిర్వహించాల్సి ఉందని.. అందుకోసం పూణే నుంచి ఢిల్లీకి కాలేయాన్ని తీసుకురావాలని తమకు సమాచారం అందిందని ఐఏఎఫ్ వెల్లడించింది. ఈ విషయం తెలియగానే వెంటనే ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ నుంచి వైద్యుల బృందాన్ని ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు తెలిపింది. మరోవైపు.. ఆ మాజీ సైనికుడికి కావాల్సిన కాలేయాన్ని కూడా పూణే నుంచి ఢిల్లీకి తీసుకువచ్చేందుకు ఐఏఎఫ్‌కు చెందిన డోర్నియర్ విమానాన్ని రంగంలోకి దింపినట్లు తెలిపింది.


మాజీ సైనికుడి ప్రాణాలను కాపాడటంలో ఈ మిషన్ చాలా ప్రత్యేకమైందని ఐఏఎఫ్ వెల్లడించింది. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడటం తమకు ఎంతో అవసరమని తెలిపింది. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా ఆ వ్యక్తి జీవితాన్ని రక్షించడంలో సహాయపడినట్లు భారత వైమానిక దళం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎఫ్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రశంసలు అందుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించి కొన్ని ఫోటోలను ఐఏఎఫ్ అధికారులు ట్విటర్‌లో షేర్ చేయడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.


కొన్ని రోజుల క్రితం జమ్మూలో మంచు తుఫాను, కొండచరియలు విరిగిపడటంతో 80 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన ఐఏఎఫ్.. వారందరినీ సురక్షితంగా కాపాడి బయటికి తీసుకువచ్చింది. భారీ హిమపాతం, కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారులు మొత్తం మూసుకుపోయాయని.. ప్రమాదకరమైన జమ్మూ-శ్రీనగర్ హైవేపై చాలా మంది ప్రయాణికులు చిక్కుకుపోగా.. వారిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో రాజస్థాన్ లా యూనివర్సిటీకి చెందిన 74 మంది విద్యార్థులు, 7 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com