కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'తో దేశ యువతకు అన్యాయం జరుగుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం లేఖ రాశారు. 'అగ్నిపథ్' తీసుకొచ్చి సైనిక దళాల్లో శాశ్వత నియామకాలను కేంద్రం నిలిపి వేసిందన్నారు. 'అగ్నిపథ్'తో కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉపాధి ఉంటుందన్నారు. దీంతో యువత భవిష్యత్తును కేంద్రం ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు.
“2019-2022 మధ్య 2 లక్షల మంది యువత త్రివిధ దళాల్లో చేరారు. అన్ని కష్టాలు ఎదుర్కొని సైన్యంలో సేవలందించారు. అగ్నిపథ్ పథకం ప్రవేశపెడుతున్నట్లు 2022 మే 31న ప్రభుత్వం చేసిన ప్రకటనతో వారి ఆశలన్నీ నీరుగారాయి. ‘అగ్నిపథ్’ స్కీమ్ ప్రకటనతో సైన్యం ఆశ్చర్యానికి గురైందని నేవీ, ఎయిర్ఫోర్స్కు ఇది పిడుగుపాటు లాంటి వార్త అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. మన యువత ఇలా బాధపడకూడదు. న్యాయం జరిగేలా మీరే చూడాలి.” అని ఖర్గే రాష్ట్రపతికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.