కుప్పం సభలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక వైకల్యానికి నిదర్శనమని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... 4 ఏళ్ల 10 నెలల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు ఇవ్వని జగన్.. ఆఖరినెలలో అద్భుతాలు చేస్తాననడం ప్రజల్ని వంచించడం కాదా..? అని ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో పంటలు ఎండబెట్టిన జగన్ రెడ్డి.. కుప్పం ప్రజలకు నీళ్లిస్తాడంటే నమ్మాలా..? అని నిలదీశారు. 7 సార్లు చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగని అరాచకం.. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ నియోజవకర్గంలో జరిగిందని విరుచుకుపడ్డారు. అమరావతిని నిర్మించడం ఎంత నిజమో... కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న జగన్ మాటలు అంతే నిజమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజంతో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నప్పుడు జగన్‌కు కుప్పం ప్రజలు గుర్తురాలేదా..? అని ప్రశ్నించారు. ప్రజలు తనకు, తన పార్టీకి చరమగీతం పాడబోతున్నారని తెలిసీ జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఓడిపోయే వ్యక్తి కుప్పంలో చంద్రబాబుపై గెలిచే వైసీపీ అభ్యర్థిని మంత్రిని చేస్తాననడం నియోజకవర్గ ఓటర్లను అవమానపరచడమేనని మండిపడ్డారు. జగన్ ఎన్ని వాగ్ధానాలు చేసినా..ఎంతగా నటించినా కుప్పంలో టీడీపీ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. 8వ సారి కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.