జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీచేసే అసెంబ్లీ స్థానంపై స్పష్టత వచ్చింది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇటీవల ఇరు పార్టీల అధినేతలు అభ్యర్థుల జాబితా వెల్లడించే సమయంలో జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. అందు లో పవన్ భీమవరం నుంచి పోటీచేస్తారని ఎందుకు ప్రకటించలేదనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం నుంచే పవన్ మొగ్గుచూపినట్లు తెలిసింది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 91 వేలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీచేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్, ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చనేది జనసేన వ్యూహంగా ఉంది. కాగా.. పిఠాపురంలో టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొనసాగుతున్నారు. ఈయనకు బలమైన నేతగా పేరుంది. అయితే పిఠాపురం సీటును తొలుత జనసేన కోరినప్పుడు వర్మను దృష్టిలో ఉంచుకుని వేరే నియోజకవర్గాన్ని అడగాలని టీడీపీ కోరింది. కానీ జనసేన ఈ సీటుపై పట్టుబట్టడం, అది కూడా స్వయంగా పవన్ పోటీచేయాలని నిర్ణయించడంతో టీడీపీ అంగీకరించినట్లు సమాచారం.