తొలి జాబితా ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు మొదలుపెట్టారు. మంగళవారం ఉండవల్లి నివాసానికి పలు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కొందరిని కోరారు. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీలు ఇచ్చారు. ఇంకొందరు నేతలతో అక్కడి రాజకీయ సమీకరణలపై చర్చించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకూ ఈ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. సీటు ఇవ్వలేదంటే.. మిమ్మల్ని పార్టీ వద్దని అనుకున్నట్లు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. సర్వేలు, రాజకీయ సమీకరణలు, ప్రజాభిప్రాయం మేరకే ఎంపికలు జరిగాయన్నారు. నేతలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయనకు మాటిచ్చారు. అనంతపురం జిల్లా శింగనమల (ఎస్సీ) స్థానానికి శ్రావణి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో అసంతృప్తికి గురైన ముఖ్య నేతలు కేశవరెడ్డి, నర్సానాయుడుతో బాబు మాట్లాడారు. సర్వేల్లో వచ్చిన ప్రజాభిప్రాయం ప్రకారం ఆమెను ఎంపిక చేశామని, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ యంత్రాంగం పనిచేసేలా చూడాలని వారిని కోరారు. పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారికి భవిష్యత్‌లో తగిన అవకాశాలు వస్తాయని చెప్పారు. అదే జిల్లా మడకశిర (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిని కూడా ఆయన పిలిపించారు. యువ అభ్యర్థి అనిల్ కుమార్‌కు సహకరించి గెలిపించి తీసుకురావాలని కోరారు. కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థి నిర్ణయం జరిగిందని తిప్పేస్వామి ఫిర్యాదు చేయగా.. సర్వేల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని అధినేత చెప్పారు. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. అనంతపురం ఎంపీ సీటుకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని, అనంతపురం అర్బన్ సీటును ముస్లిం మైనారిటీలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు. కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా కలిసిన వారిలో ఉన్నారు. కదిరి ప్రస్తుత ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్ పోటీకి న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని వింటున్నామని, ఆయనకు అవకాశం లేకపోతే తనకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హిందూపురం లోక్‌సభ స్ధానానికైనా తన పేరును పరిశీలించాలని, గతంలో ఈ సీటు నుంచి ముస్లిం మైనారిటీ అభ్యర్థి ఎంపీగా గెలిచిన చరిత్ర ఉందని చెప్పారు. పరిశీలిస్తానని బాబు వారికి హామీఇచ్చారు.